![]() |
![]() |

దీపిక పదుకోన్ గురించి ఈ మధ్య బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ అన్న మాటలు గుర్తున్నాయా? ఆస్కార్ వేదిక మీద తను తానుగా మాత్రమే కాకుండా, ఓ దేశంగా, కోట్లాది మందికి ప్రతినిధిగా, అంత ధైర్యంగా, అంత ఆత్మవిశ్వాసంతో నిలుచోవడం తేలికైన విషయం కాదు. దానికి చాలా తెగువ కావాలి. లేత భుజాల మీద అత్యంత గొప్ప బాధ్యతను మోయగలనన్న నమ్మకం కావాలి. అవన్నీ దీపికలో కనిపిస్తున్నాయి అంటూ ట్వీట్ చేశారు కంగనా రనౌత్. ఎప్పుడూ కోపంగా కనిపించే కంగనా రనౌత్ ఉన్నట్టుండి ఇంత సాత్వికంగా ఎలా మారిపోయారు? అసలు దీపికను ఎందుకు పొగిడారు అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీని గురించి మళ్లీ రెస్పాండ్ అయ్యారు కంగనా రనౌత్. ``నేను దీపిక పదుకోన్‌ని పొగడటం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పే మాట ఒకటే, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మీరందరూ అనుకుంటున్నంత క్లిష్టమైన వ్యక్తిని కాదు నేను. చాలా సింపుల్ వ్యక్తిని. కృష్ణుడి భక్తురాలిని. ధర్మాన్ని పాటిస్తాను. ఎవరిని ఎక్కడ పొగడాలో అక్కడ పొగడకపోతే పాపం తగులుతుంది. అనర్హుల్ని పొడిగినా పాపమే తగులుతుంది. అర్హులని ప్రశంసించడంలో బాలీవుడ్ ఫెయిలవుతుందేమో గానీ, నేనెప్పుడూ ఫెయిల్ కాను`` అని అన్నారు కంగన. తప్పుని తప్పు అని చూపగలిగినప్పుడు, ఒప్పుని ఒప్పు అని కూడా చెప్పగలగాలి. ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు తప్పక ప్రశంసించాలి. అవతలి వ్యక్తి ఎవరు అంటూ లెక్కలేసుకుని కూర్చోకూడదు. దీపిక విషయంలో మీరు చేసింది ముమ్మాటికీ కరెక్టే అంటూ కితాబిచ్చారు ఓ నెటిజన్.
బాలీవుడ్‌లోనే కాదు, ఎవరు ఎక్కడ మంచి పని చేసినా కంగన ఎప్పుడూ వారికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ బాలీవుడ్ జనాలు ఎందుకో కంగనని వెనకేసుకుని రారు. ఒకవేళ అలా చేస్తే, బాలీవుడ్ పెద్ద మనుషులు వాళ్లను కూడా దూరం పెట్టేస్తారనే భయమేమో.. అంటూ రాసుకొచ్చారు మరో నెటిజన్. ఎవరేం అనుకున్నా నేను చేయాల్సింది చేస్తూనే ఉంటాను అంటున్నారు కంగన రనౌత్.
![]() |
![]() |